Saturday, September 15, 2007

మీ నిర్వాకం సంగతి చూడ్డానికి వేరే రాష్ట్రానికి పోవాలా ముఖ్యమంత్రీ?

ఏ రాష్ట్రంలోనూ ఆంధ్రప్రదేశ్‌లో లాగా అభివృద్ధి జరగడం లేదట. ముఖ్యమంత్రి అంటున్నాడు. ఈ సంగతి తేల్చేందుకు ఏ రాష్ట్రానికైనా సరే వెళ్ళి చూద్దామని సవాలు కూడా చేసాడు. ఇద్దరం కలిసి వెళ్ళి చూసొద్దామని చంద్రబాబును ఆహ్వానించాడు కూడా.

మన అభివృద్ధి సంగతి తెలుసుకుని మూర్ఛబోదామని నాకూ ఉంది. కానీ అంతకంటే ముందు చంద్రబాబు, ఇతర ప్రతిపక్షాలు అలా దేశం తిరిగొస్తే ప్రయోజనమేమైనా కలుగుతుందా అని ఆలోచించ దలచాను. ఈమధ్య ఈ జనాలు ఓబులాపురం చూసొచ్చారు. సింగడు అద్దంకి వెళ్ళొచ్చాడు అన్నట్టు.. వీళ్ళూ వెళ్ళారు, వచ్చారు. తెదేపా 'ఏమీ బాలేదు' అని అంది.. ఏంబాలేదో, ఎందుకు బాలేదో
చెప్పలేకపోయింది, మామూలుగానే! మిగతావాళ్ళు 'ఏంలేదు అంతా బానే ఉంది' అంటూ జేజేలు కొట్టొచ్చారు. ఆ మాత్రపు ముష్టి పని కోసం ఈ నాయకులంతా పాంట్లు ఎగలాక్కోని ఓబులాపురం దాకా పొయ్యొచ్చారు. అవునులే జీవితంలో మరో రకంగా 'గాలి'మిషను (హెలికాప్టరు) ఎక్కగలిగే వాళ్ళా!? 'గాలి' అబ్బాయి వీళ్ళని చూసి ముష్టి వెధవలని అనుకొని నవ్వుకొని ఉంటాడు.
హై. లో కూచ్చుని గనులు లీజుకెలా ఇచ్చారో పరిశీలిస్తే ఇక్కడే తెలిసిపోయేది ఆ లీజు భాగోతం; కోర్టుకు తెలిసిపోలా!!?

వీళ్ళింత చేతకాని వాళ్ళని తెలిసే ముఖ్యమంత్రి వెళ్ళొద్దాం వస్తారా అని చిటికెలేస్తున్నాడు. అసలు మన గొప్ప తెలుసుకొనేందుకు ఎక్కడికన్నా పొయ్యి రావాలా, అనేది నా సందేహం.

ముఖ్యమంత్రీ.. అక్కడికెళ్ళి ఏంచేస్తారు?

బాబోయ్ టీవీ 9

టీ.వీ 9 తెలుగుకు నా శత కోటి నమస్కారాలు...వీళ్ళని ఆ దేవుడు కూడా బాగు చెయ్యలేడు. ఏదో బీ.బీ.సి వాళ్లు తయారుచేసిన తెలుగును చదువుతున్నట్లుగా ఉంది. నానాటికి తీసికట్టు అంటే ఇదే మరి. ఈ భాషా ఖూనీ ఎక్కువగా దీప్తి వాజ్ పేయి చదువుతున్నప్పుడే జరగటం గమనార్హం.

కొన్ని ఉదాహరణలు...

లంక బౌలర్స్ అద్భుతంగా ఫైట్ బ్యాక్ చేసి పాక్ బ్యాటింగ్ను కొలాప్స్ చేసారు...

వివరాలు యాడ్స్ తరువాత, ఐ విల్ కమ్ బ్యాక్, డోంట్ గో ఎవే ఎనీవేర్...వెల్కమ్ బ్యాక్ అగైన్

ఇలాంటివి కోకొల్లలు...నాకర్ధం అయ్యింది ఏమిటంటే, ఎన్.ఆర్.ఐ తెలుగు వాళ్ళకు అర్ధం అయ్యేలా చదువుతున్నారేమో అని...కాని ఎన్.ఆర్.ఐ తెలుగు ఆంధ్ర తెలుగు కంటే ఇంకా స్వఛ్ఛంగా ఉంటుందని వారు తెలుసుకుంటే మంచిది.

వినాయకచవితి

విఘ్నదేవా రార మమ్ము బ్రోవ వేడికోలు నీకిదే దేవదేవ ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టుమైయ్యా పూలు పత్రిపూజతో మొక్కమయ్యా


వినాయకచవితి

శుభాకాంక్షలు

Tuesday, September 4, 2007

చక్ దే ఇండియా...


ఓకే మొదటి లైన్లోనే తీర్పు చెప్పేస్తా. మంచి సినిమా.

ముందు ఇక్కడ చెప్పుకోవాల్సింది నాకు షారూఖ్ ఖాన్ అంటే ఇష్టం లేదు. ఆ చెత్త సినిమాలు, వెధవ వేషాలు, ఫామిలీ డ్రామా అని చెప్పి కరణ్ జోహర్ వేయించే చెత్త వేషాలు అన్నీ కలిసి నాకు షారూఖ్ అంటే విముఖత కలిగించాయి. అలాగని టాలెంట్ లేదా అంటే ? ఉందీ...

మొత్తానికి అలా విసుగెత్తిన నాకు షారుఖ్ టాలెంట్ మొదటి సారిగా స్వదేశ్ లో కనిపించింది. చాలా మంచి సినిమా అది. మొదటి సారి ఓ అర్థవంతమయిన సినిమాలో నటించాడు అనిపించింది. దాని తరవాత మళ్ళీ షరా మామూలే అయినా మళ్ళీ "చక్ దే ఇండియా" సినిమాతో నే వెనక్కొచ్చా అని చెప్పాడు.

ఇక సినిమా కథ విషయానికి వస్తే ఇంతకు ముందు ఇలాంటి కథతో సినిమాలు వచ్చాయి. సినిమా కబీర్ ఖాన్ అనే ఓ హాకీ ఆటగాడు/కోచ్ కథ.
సినిమా ఇండియా పాకిస్తాన్ మధ్య వరల్డ్ కప్ ఫైనల్ హాకీ మాచ్ తో మొదలవుతుంది. అందులో ఆఖరి నిముషంలో వచ్చిన పెనాల్టీ ని మిస్ చేసి కబీర్ ఖాన్ దేశ ద్రోహవుతాడు. కొద్దిగా నాటకీయంగా చూపించినా ఈ నాడు మన వార్తా చానళ్ళు చాలా మటుకు ఆ కోవకి చెందినవే. చిలువలు పలువలు చేసి చూపించడం, నోటికే చెత్త వస్తే ఆ చెత్త వాగడం, చిన్న విషయాలను పెద్దవి చెయ్యడం, అనవసర డిబేట్లు పెట్టడం మొదలయినవి. ఇవన్నీ చేసి కబీర్ ఖాన్ ని ఓ దేశ ద్రోహి లా చిత్రీకరిస్తారు.

కట్ చేస్తే ఓ ఏడేళ్ళ తరవాత కబీర్ ఖాన్ మళ్ళీ తెర మీదకొస్తాడు. అదీ ఇండియా మహిళా హాకీ టీం కోచ్‌గా పనిచెయ్యడానికి. అంత వరకూ రాష్ట్రాల వారీగా ఆడే ఆ జట్టుని ఓ తాటి మీదకి తీసుకొచ్చి, డిసిప్లిన్ నేర్పించి, అదేలేండి ఆఖరికి వరల్డ్ కప్ నెగ్గేలా చేస్తాడు. అవును కొద్దిగా ఎక్సాజరేటెడ్ గానే ఉంటుంది కథ, కానీ దానిని నడిపిన తీరుని మాత్రం మెచ్చుకోవాల్సిందే. ఎడిటింగ్ కి ప్రాధాన్యత ఏమిటో నాకింతకు ముందు వరకూ అర్థమయ్యేది కాదు. ఇప్పుడు తెలిసింది. సీన్లన్నీ చక్కగా కుదిరాయి. పాటలు లేవు. అవును నిజం. అదే కాక ఇప్పుడు మన దేశంలో జరుగుతున్న క్రికెట్ పిచ్చి తప్ప ఇంకేదీ పట్టించుకోకపోవడం, అందులోనూ మహిళలు ఆడుతున్నారంటే దానిని చిన్న చూపు చూడడం, సెలెక్టర్ల అతి చేష్టలు, వంటి నిజాలెన్నో ఉన్నాయి ఈ సినిమాలో. అంతే కాదు వ్యక్తిగత రికార్డుల కోసం ఆట ఆడే ఆటగాళ్ళ గురించి కూడా సరిగ్గా చూపించాడు.

కానీ ఈ సినిమా ఓ డ్రీం అని చెప్పవచ్చు. ఎందుకంటె ఈ దేశంలో అలాంటి కోచ్ రానూ లేడు, అలాంటి మార్పులు జరగనూ లేవు, బాగు పడే అవకాశాలూ కనిపించట్లేదు.

మొత్తానికి ఈ సినిమాలో నాకు నచ్చిన అంశాలు:

1. ఏ క్రికెట్ నో ఎంచుకోకుండా మన జాతీయ క్రీడ అయిన హాకీని కథాంశంగా ఎంచుకోవడం. (అవును ఇప్పుడు మన జాతీయ క్రీడ హాకీ అని కూడా జనాలు మర్చిపోయారేమో.)

2. ఆటగాళ్ళు రాష్ట్రం తరఫున కాదు దేశం తరఫున ఆడుతున్నారు అని ఎన్నో చోట్ల గుర్తు చెయ్యడం

3. ఏ క్రీడలోనయినా సీనియర్ ఆటగాళ్ళు ఇప్పుడు టీం లో ఎలా చెలాయిస్తున్నారో చూపించడం

4. దేశం తరఫున ఆడేటప్పుడు ప్రైడ్ ఉండాలి అని చెప్పడం


5. మన మీద మనం నమ్మకం పెంచుకుని, సాధనతో, కఠోర శ్రమతో విజయం సాధించగలం అని చెప్పడం

6. సొంత రికార్డుల ఆట కాదు, ఏ ఆట అయినా జట్టు లాగా ఆడాలి అనే పాయింట్ ని పదే పదే స్ట్రెస్ చెయ్యడం

సినిమాలో ఎగస్ట్రాలు లేవా ? ఉన్నాయి. కానీ మొత్తం మీద అంతర్లీనంగా ఉన్న థీం సినిమా లో అతి ని డామినేట్ చేస్తుంది. నాకయితే నచ్చింది. కుదిరితే తప్పకుండా చూడండి. "చక్ దే ఇండియా..."

శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు


వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళీ
నవరస మురళీ..ఆనందన మురళీ
ఇదేనా ఇదేనా ఆ మురళి..మొహనమురళీ
ఇదేనా ఆ మురళీ
~
వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళీ
నవరస మురళీ..ఆనందన మురళీ
ఇదేనా ఇదేనా ఆ మురళి..మొహనమురళీ
ఇదేనా ఆ మురళీ
~
కాళింది మడుగునా కాళియుని పడగలా
ఆబాల గోపాల మాబాల గోపాలుని
కాళింది మడుగునా కాళియుని పడగలా
ఆబాల గోపాల మాబాల గోపాలుని
అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడ
అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడ
తాండవమాడిన సరళి గుండెల మ్రోగిన మురళి
ఇదేనా..ఇదేనా ఆ మురళీ
~
అనగల రాగమై తొలుత వీనులలరించి
అనలేని రాగమై మరలా వినిపించీ మరులే కురిపించి
అనగల రాగమై తొలుత వీనులలరించి
అనలేని రాగమై మరలా వినిపించీ మరులే కురిపించి
జీవన రాగమై బృందావన గీతమై
ఆ.. జీవన రాగమై బృందావన గీతమై
కన్నెల కన్నుల కలువల వెన్నెల దోచిన మురళి
ఇదేనా.. ఇదేనా ఆ మురళీ
~
వేణుగానలోలుని మురిపించిన రవళి..
నటనల సరళి ఆ నందనమురళీ
ఇదేనా ఆ మురలి మువ్వల మురళీ
ఇదేనా ఆ మురళీ
~
మధురానగరిలో యమునా లహరిలో
ఆ రాధ ఆరాధనా గీతి పలికించి
మధురానగరిలో యమునా లహరిలో
ఆ రాధ ఆరాధనా గీతి పలికించి
సంగీత నాట్యాల సంగమ సుఖ వేణువై
ఆ..ఆ..ఆసంగీత నాట్యాల సంగమ సుఖ వేణువై
రాసలీలకే ఊపిరిపోసిన అందెల రవళి
ఇదేనా..ఇదేనా ఆ మురళీ
~
వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళీ
నవరస మురళీ..ఆనందన మురళీ
ఇదేనా ఇదేనా ఆ మురళి..మొహనమురళీ
ఇదేనా ఆ మురళీ

Saturday, September 1, 2007

Wednesday, August 29, 2007

ఒక చిన్న కవిత మీకొసం సుమా!!!

ఎన్నాళ్ళిలా
ఏడుపులు.. ఓదార్పులు
తప్పుకో ఇక ఆడలేనని

జీవన క్రీడ

ఒప్పుకో ఇక సాగలేనని
ఈ ముళ్ళ బాట

అవ్వ బువ్వ తినలేదని
తాత దగ్గు వినలేనని
చూడలేని అమ్మ కళ్ళూ
నడవలేని నాన్న కాళ్ళూ
ఎన్నాళ్ళీ రోదన రాగం?
ఎన్నాళ్ళీ వేదన రోగం?

గంపెడంత బావ ఆశ
తీర్చలేని అక్క గోస
సమాజాల దుర్భిణిలో
సగటోడా ఎన్నాళ్ళు

ఛీ! ఛీ!

వెళ్ళిపో దూరంగా
సన్యాసం లోకి
సాధువులా ముసుగేసుకో
పిరికిపంద!!